రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫారెస్టు ట్రెక్ పార్క్ ప్రారంభోత్సవం ఈరోజు జరగనుంది. ఈ ట్రెక పార్క్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనితో పాటుగానే హరితహారం కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను శుక్రవారం మంత్రి సబితారెడ్డి పరిశీలించారు.
ఫారెస్టు ట్రెక్ పార్క్ ప్రారంభోత్సవంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మంచిరేవులలో ఇవాళ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం, మంత్రి సబితా రెడ్డితో పాటు ఎమ్మెల్యే యాదయ్య, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రతాప్‌రెడ్డి, సీఎంవో సెక్రటరీ భూపాల్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో టీఎస్‌పీఏ నుంచి మంచిరేవుల మీదుగా నార్సింగి వరకు ఓఆర్‌ఆర్ సర్విస్ రోడ్డులో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మార్గాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందని సైబరాబాద్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ తెలిపారు.