Dasoju Sravan : అధికార అహంకారాన్ని రేవంత్ నరనరాన ఎక్కించుకున్నారు : దాసోజు
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. అధికార అహంకారాన్ని సీఎం రేవంత్ రెడ్డి నరనరాన ఎక్కించుకున్నారని ఫైర్ అయ్యారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని చెప్పారు. తెలంగాణను సాధించిన కేసీఆర్పై అసభ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గల్లీ లీడర్ కన్నా అధ్వాన్నంగా రేవంత్ తీరు ఉందని.. ఆయన గడ్డి తింటున్నాడా లే అన్నం తింటున్నాడా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాలకు ఆయన ఓ శనిలా మారారని ఆరోపించారు. రాహుల్ రేవంత్ తీరును మార్చాలని సూచించారు.
రేవంత్ బిల్లా రంగాలకు ప్రతి రూపం అని.. ఓ సారి అద్దం ముందు కూర్చుని ముఖం చూసుకోవాలంటూ దాసోజు విమర్శించారు. రేవంత్ కేసీఆర్కు గోరీ కట్టేంత మొనగాడా అని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చినందుకా ..తెలంగాణను అన్ని విధాల అభివృద్ధి చేసినందుకు కేసీఆర్కు గోరీ కడతావా అని నిలదీశారు. కేసీఆర్ మీద రేవంత్ భాష ఇలాగే కొనసాగితే తెలంగాణ ప్రజలే నాలుక చీరుతారని చెప్పారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే రేవంత్కు అసహనం పొడుచుకొస్తోందన్నారు. హామీల అమలులో ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ - బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు వరుసగా బయటపడుతున్నాయని శ్రవణ్ అన్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నికల నోటిఫికేషన్, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం, రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం, అదానీతో ఒప్పందం, తెలంగాణకు ఐపీఎస్ల కేటాయింపు వంటి అంశాలు ఆ పార్టీల బంధాన్ని గుర్తుచేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ సమాజం వీటిని గుర్తించాలని కోరారు. రేవంత్కు చేతనైతే కృష్ణ రివర్ బోర్డు విషయంలో కేంద్రం మెడలు వంచేందుకు కృషి చేయాలని సవాల్ విసిరారు.