BRS సర్కార్ 9 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు..డిప్యూటీ సీఎం
నిధులు, నీళ్లు, నియామకం కోసం కోరి కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత పదేళ్లలో ప్రజలు వాటిని పొందలేకపోయారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ప్రభుత్వంపై పదేళ్లుగా పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... ఆ లక్ష్యాలనే నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. అందుకే ప్రజల దగ్గరకు వెళ్లి ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి చేస్తున్న కార్యక్రమమే ప్రజాపాలన అని చెప్పారు. తమది ప్రజల ప్రభుత్వమని, దొరల సర్కార్ కానే కాదని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని అభయహస్తం దరఖాస్తులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ .. "ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం మనది. ప్రజాపాలన అందిస్తామని చెప్పి ప్రజలను ఒప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేశాం. మేం ఇచ్చిన ఆరు గ్యారెంటీవలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని, సంపదను ప్రజలకు అంకితం చేస్తాం. ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టి దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించాం. ప్రజలు ఎవరు ఇబ్బందిపడాల్సిన అవసరం లేదని" అన్నారు. ప్రజల దగ్గరకే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.
"ఒక వర్గానికి, ఒక వ్యక్తికి సంబంధించిన ప్రభుత్వం కాదు మాది. మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం కాదు మాది. ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుస్తాం. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తాం.అర్హత కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు" అని చెబుతూ.. తాను పాదయాత్ర చేసిన సమయంలో మహిళలు వారి సమస్యలు చెప్పుకున్నారని వివరించారు. గతంలో కాంగ్రెస్ పంచిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్క రేషన్ కార్డుకు దరఖాస్తు తీసుకోలేదని విమర్శించారు.