Bhatti Vikramarka : రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పిన డిప్యూటీ సీఎం
రాష్ట్ర మహిళలకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు త్వరలోనే వడ్డీ లేని రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీఎం భట్టి విక్రమార్క ఆదివారం ఈ అంశంపై కీలక ప్రకటన చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతుంది. ఇప్పటికే గృహజ్యోతి , మహాలక్ష్మీ పథకాలతోపాటు ఆరోగ్యశ్రీని అమలు చేసిన రేవంత్ టీమ్.. మహిళలకి మరో తీపి కబురు అందించింది. గత కొన్నేళ్లుగా వడ్డీ లేని రుణాల కోసం డ్వాక్రా మహిళలు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. వారి నిరీక్షణకు తెరదించుతూ.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క త్వరలో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మధిర మండలం రొంపిమల్ల రోడ్డు శంకుస్థాపన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని.. త్వరలో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తామన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే హామీ ఇచ్చిన గ్యారెంటీ పథకాలను అమలు చేశామన్న భట్టి.. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, కాంగ్రెస్ అంటేనే సంక్షేమం అని చెప్పారు. తమ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇప్పటికే తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన రెండో రోజే.. మహాలక్ష్మి పథకం కింద ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఈ పథకానికి మహిళల నుంచి మంచి స్పందన లభించిందని అన్నారు.
అయితే గత నెలలో కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. డ్వాక్రా రుణాలపై మీడియా ముఖంగా కీలక ప్రకటన చేశారు. గత నెల ఫిబ్రవరి 18న భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశంలో కూడా.. త్వరలోనే డ్వాక్రా రుణాలు అందిస్తామని అన్నారు. తాజాగా మరోసారి ఈ అంశంపై ప్రకటన చేశారు.