విభజన హామీలు అమలు, పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రధాని మోడీని కోరినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రధాని నరేంద్రమోడీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫెడరల్ స్పూర్తికి విఘాతం కలగకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని మోడీకి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. రాష్ట్ర పురోగతికి కేంద్రం తరఫున చేయాల్సిన సాయం గురించి మోడీ దృష్టికి తెచ్చినట్లు భట్టి చెప్పారు. శ్వేతపత్రాల విడుదల అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తెచ్చామని వివరించారు.
విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల విషయంలో గత ప్రభుత్వం తాత్సారం చేసిందని భట్టి ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఇప్పటికైనా ఆ హామీలను అమలు చేయాలని కోరినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో పట్టించుకోలేదని వాటిని నెరవేర్చాలని ప్రధానిని అభ్యర్థించామని భట్టి విక్రమార్క అన్నారు. విభజన చట్టం ప్రకారం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని ప్రధానికి చెప్పామని స్పష్టం చేశారు.
ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి ప్రధాని మోడీకి వివరించడంతో పాటు హైదరాబాద్కు ఐఐఎం, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయమని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు భట్టి చెప్పారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి కూడా ప్రస్తావించామని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై పెనుభారం మోపిందని, దాని నుంచి బయటపడేలా కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని ప్రధాని దృష్టికి తెచ్చినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.2250కోట్ల నిధులతో పాటు మరికొంత సాయం అందించాలని కోరగా.. ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని భట్టి స్పష్టం చేశారు.