Bhatti Vikramarka:రామగుండంలో ఎన్టీపీసీ ఫేజ్‌‌2 ప్లాంట్‌‌ పనులు చేపట్టాలి.. భట్టి విక్రమార్క

Update: 2024-01-05 01:42 GMT

వచ్చే వేసవిలో రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో విద్యుత్(Electricity) కొరత ఉండకూడదని, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని చెప్పారు.

రాష్ట్ర విద్యుత్‌ శాఖపై గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఉపముఖ్యమంత్రి.. రామగుండం ఎన్టీపీసీ ఫేజ్-2లో 2,400 మెగావాట్ల థర్మల్‌‌ ప్లాంట్‌‌ నిర్మాణం త్వరలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, ప్లాంట్‌‌ నిర్మాణానికి సంబంధించి ఎన్టీపీసీతో సంప్రదింపులు జరపాలని చెప్పారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్‌‌లో అదనంగా మరో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్ ప్లాంట్ నిర్మాణం పనులను చేపట్టాలని ఆదేశించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనాల ప్రకారం 2031–32 నాటికి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం, అభివృద్ధికి ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు

రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, తొలి విడతలో 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను నిర్మాణం చేస్తున్నదని అధికారులు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎనర్జీ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ, ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో ఇన్‌‌చార్జి సీఎండీ సయ్యద్ ముర్తుజా రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. 




Tags:    

Similar News