అంకెల గారడీతో 9 ఏళ్లు ప్రజలను మోసం చేశారు : భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ప్రభుత్వం అంకెల గారడీతో 9 ఏండ్లు ప్రజలను మోసం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి వివరించేందుకే శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పారు. శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన గత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలకు దూరంగా బడ్జెట్ రూపకల్పన చేసిందని భట్టి విమర్శించారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ కు చేసిన ఖర్చుకు మధ్య భారీగా అంతరం ఉందని చెప్పారు. గత ప్రభుత్వం రోజువారీ ఖర్చుల కోసం కూడా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుందని, 2014లో 14 శాతంగా ఉన్న రుణభారాన్ని 34 శాతానికి పెంచారని భట్టి విమర్శించారు. చేసిన అప్పులకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా అంటే అదీ లేదని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతంగా కట్టామని కేసీఆర్ చెప్పారని, చూసేందుకు వెళ్తే మేడిగడ్డ కుంగిపోయి ఉందని భట్టి విక్రమార్క విమర్శించారు. ఖర్చుకు తగినట్లు కంటికి కనిపించే ఒక్క భారీ ప్రాజెక్టైనా ఉందా ప్రశ్నించారు. మేడిగడ్డ మొత్తం ఇసుకలో కూరుకుపోయిందని, దాన్ని ఏం చేయలేమని నేషనల్ డ్యాం సెక్యూరిటీ అథారిటీ చెప్పిందని అన్నారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కూడా సురక్షితం కాదని చెప్పిందని సభకు వివరించారు.