(Rajanna Temple) మేడారం జాతరకు ముందుగా తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువైంది. భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. మేడారం జాతర కంటే ముందుగా ఈ రెండు ఆలయాలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రెండు ఆలయాల్లో మొక్కులు తీర్చుకున్న భక్తులు ఆ తర్వాత మేడారం జాతరకు వెళ్తారు. దీంతో రెండు వారాల నుంచి ఈ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
బారులు తీరిన భక్తులు
అదేవిధంగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి కూడా భక్తులు బారులు తీరారు. రెండు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రోజూ 40 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వేములవాడ ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే ఒక్క రోజు నిద్ర చేసి ఆ తర్వాత భక్తులు కొండగట్టుకు పయణం అవుతున్నారు. దీంతో భక్తుల రద్దీ భారీగానే పెరుగుతూ వస్తోంది. ఈ ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు కోడెను మొక్కుగా చెల్లించుకుంటూ ఉంటారు.
ఆర్జీత సేవలు రద్దు
సాధారణంగా శివరాత్రి సమయంలో వేములవాడలో రాజన్నని భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు శివరాత్రి కంటే ఎక్కువ మంది వస్తున్నారు. భక్తుల తాకిడి ఎక్కువవడంతో రెండు ఆలయాల్లోనూ ఆర్జీత సేవలను రద్దు చేశారు. వేములవాడలో స్వామి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా కొండగట్టులో దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.
సౌకర్యాలు లేక ఇబ్బందులు
వేములవాడ, కొండగట్టు రెండు ఆలయాల్లోనూ భక్తుల తాకిడి ఎక్కువైంది. అయితే ఆలయాల పరిసర ప్రాంతాల్లో మాత్రం సరైన వసతి సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా మంది భక్తులు స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్లిపోతున్నారు. చాలా మంది భక్తులు దర్శనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడీ స్వామి దర్శనం కోసం ఎదురుచూడాల్సి వస్తోందని, ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తే బావుంటుందని కోరుతున్నారు. ఈ రెండు ఆలయాల్లో రద్దీ సమ్మక్క, సారక్క జాతర వరకూ కొనసాగనుండటంతో ఆలయ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.