కేసీఆర్ పనైపోయింది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ
రాష్ట్రం ఏర్పడ్డతర్వాత వరుసగా రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ.. ఈసారి అనూహ్యంగా ఓడిపోయింది. కేవలం 39 స్థానాలకే పరిమితం అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఏకంగా 64 స్థానాల్లో గెలుపొంది అధికారం చేపట్టనుంది. తెలంగాణలో గ్రాఫ్ పడిపోయిన బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. పార్టీ కీలక నేతలైన బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు లాంటి వాళ్లు ఓడిపోవడం ఆ పార్టీకి కాస్త జీర్ణించుకోలేని విషయమే. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ధర్మపురి అరవింద్.. తెలంగానలో బీఆర్ఎస్ శకం ముగిసిందన్నారు. కేసీఆర్ పాలన అంతమైనందుకు సగం సంతోషంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో హుందాతనంతో కూడిన ఆరోగ్యకర పరిస్థితులు మళ్లీ వస్తాయని చెప్పుకొచ్చారు. ఇకపై దాడుల సంస్కృతికి ఫుల్ స్టాప్ పడుతుంది. రాజకీయాల్లో భాష మారుతుందని అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నిక దేశంలోనే అత్యంత ఖర్చుతో కూడుకున్న ఎన్నికగా నిలిచిందన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు జారుకుంటారని, ఇప్పటికే ప్రజల్లో అభిమానం పోయిందన్నారు. సహజ మరణం లాగా బీఆర్ఎస్ పార్టీ పతనం అవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా కూడా రావొద్దని కోరుకుంటున్నట్లు తెలిపారు.