ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఆయన సోదరుడి కుమారుడు ఆశిశ్‌రెడ్డి పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందజేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జోరుగా ప్రచారం జరిగింది. ఇందురులోని ఏదైనా ఒక సెగ్మెంట్ నుండి ఆయన ఎన్నికల బరిలో నిలవడం ఖాయం అని.. కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీ తరుఫున పోటీకి దిగుతారని వార్తలు వినిపించాయి. కానీ, దిల్ రాజు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని అప్పట్లో దిల్ రాజు సైతం క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ ఎన్నికల వేళ మరోసారి దిల్ రాజు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా దిల్ రాజు పోటీ చేస్తారని.. ఆయనకు హస్తం పార్టీ హై కమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు వినిపించాయి. దిల్ రాజు సైతం ఇటీవల కాంగ్రెస్ నేతలతో కాస్త దగ్గరగానే మెలుగుతుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కేసీఆర్‌ను పలువురు పార్టీ నేతలు, ప్రముఖులు శనివారం నందినగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర నాయక్, ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి, పిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, తదితరులు కలిశారు.