Telangana Budget 2024 : ఎన్నికలు పూర్తయ్యాక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకంటే..?

Byline :  Krishna
Update: 2024-02-10 02:14 GMT

(Telangana Budget 2024)తెలంగాణ అసెంబ్లీలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఏడాదిలో అటు కేంద్రం ఇటు రాష్ట్రాలు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతాయి. మొన్న కేంద్రం సహా ఏపీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టాయి. 

కేంద్ర నిధులపై నో క్లారిటీ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే రేవంత్ సర్కార్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి పలు కారణాలు ఉన్నాయి. వాస్తవానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ మేరకు నిధులు వస్తాయన్న అంచనాలతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్‌లు, సీఎస్‌ఎస్‌ నిధుల కేటాయింపులను అంచనా వేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాను పేర్కొంటూ బడ్జెట్‌ను రూపొందిస్తారు. ఇటీవల కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టగా.. రాష్ట్రానికి వచ్చే నిధులపై క్లారిటీ లేదు.

శాఖల వారీగా కొలిక్కి రాని కసరత్తు

ఓటాన్‌ అకౌంట్‌లో పన్నుల విధానంలో ఎలాంటి మార్పు లేదని కేంద్రం ప్రకటించింది. అయితే రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో విధాన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పలేదు. దీంతో అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయన్న దానిపై సరైన అంచనా లేదు. వీటితో పాటు రాష్ట్రంలో వివిధ శాఖల ఆర్థిక ప్రతిపాదనలు ఓ కొలిక్కి రాలేదు. గత ప్రభుత్వం చేసిన అప్పులు సహా వచ్చే ఆదాయం, ఆరుగ్యారెంటీలకు బడ్జెట్లో కేటాయింపు వంటి అంశాలపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. దానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉంది.

ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని రేవంత్ సర్కార్ మధ్యంతర బడ్జెట్కే మొగ్గు చూపింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. దానిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ నూ రూపొందించనుంది. పూర్తి స్థాయి బడ్జెట్ లోనే ఆరు గ్యారెంటీలు సహా పలు హామీలకు కేటాయించే నిధులపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఇక గత పార్లమెంటు ఎన్నికల వేళ 2019-20 కేంద్రం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌నే ప్రవేశపెట్టగా.. కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆరు నెలల కాలానికి మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.


Tags:    

Similar News