బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈటల రాజేందర్ సుపారీ వ్యవహారంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ప్రభుత్వం నియమించిన డ్రైవర్ సాయికృష్ణ కౌశిక్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తనను కులం పేరుతో దూషించారని కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
కౌశిక్ రెడ్డికి ప్రభుత్వం వాహనంతో పాటు ప్రోటోకాల్ డ్రైవర్ను కల్పించింది. ఈ క్రమంలో తనపై కౌశిక్ రెడ్డి పర్సనల్ డ్రైవర్ దాడికి పాల్పడ్డారని సాయికృష్ణ ఆరోపించారు. ఈ విషయం కౌశిక్ రెడ్డికి చెబితే.. మీ దళితులు ఇక మారరా అని హేళనగా మాట్లాడరని చెప్పారు. అంతేకాకుండా తనను కొట్టి అక్కడున్న సిబ్బందితో మెడపట్టి బయటకు గెంటించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కౌశిక్ రెడ్డి సహా పీఏ, పర్సనల్ డ్రైవర్ వల్ల తనకు ప్రాణహాని ఉందని.. తనకు రక్షణ కల్పించాలని సీపీని సాయికృష్ణ కోరారు.
అంతకుముందు కౌశిక్ రెడ్డి ముదిరాజ్ కులాన్ని ఉద్ధేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపనలు వచ్చాయి. దానికి సంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పెద్ద ఎత్తున ఆయన విమర్శలు వచ్చాయి. తాను అలా అనలేదు అని వివరణ ఇచ్చుకున్నా వివాదం ఆగలేదు. ఆ తర్వాత ఈటల, ఇప్పుడు డ్రైవర్ వ్యవహారంతో కౌశిక్ రెడ్డి వివాదాలకు కేంద్రంగా మారారు.