హైదరాబాద్‌లో ఈడీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈడీ అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం నుండి అధికారులు బృందాలుగా విడిపోయి కార్లలో వివిధ ప్రాంతాలకు వెళ్లారు. భారీగా సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి బయలుదేరారు. హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు సమాచారం.
ముఖ్యంగా మెడికల్ కాలేజీ రీసెర్చ్ సెంటర్లలో ఈడీ సోదాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాలోని ప్రతిమ మెడికల్ కాలేజీలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాలేజీ మేనేజ్మెంట్ ఆఫీసు, ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది మాత్రమే కాకుండా మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్.. ఎల్బీనగర్‌లోని కామినేని మెడికల్ కాలేజీ.. ఇంకా ఇతర కళాశాలల్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. దాదాపు 6 జిల్లాలో ఈడీ తనిఖీలు జరుగుతున్నాయి. కాలేజీల్లోని నిధులు వ్యవహారాల గురించి ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పలు కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు.