అమెరికా నుంచి వచ్చి పోయేటోళ్లకు ప్రజల కష్టాలు తెలుస్తాయా? - ఎర్రబెల్లి
అమెరికా నుంచి వచ్చి పోయేటోళ్లకు ప్రజల కష్టాలు తెలుస్తాయా అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని చెప్పారు. త్వరలో జరిగే ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలుస్తానని ఎర్రబెల్లి ధీమా వ్యక్తంచేశారు.
నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ పింఛన్లు, రైతు బంధు పథకాలు అందుతున్నాయని ఎర్రబెల్లి చెప్పారు. కరోనా కాలంలో నియోజకవర్గంలో ఎంతోమందిని ఆదుకున్నామని అన్నారు. పాలకుర్తి ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారి ముందుంటానని కానీ అమెరికా నుంచి వచ్చి పోయేవారిని గెలిపిస్తే వారికి ప్రజల కష్టాలు తెలుస్తాయా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దయతో తొర్రూరును మున్సిపాలిటీ చేశామన్న ఎర్రబెల్లి.. పాలకుర్తికి డిగ్రీ కాలేజ్ అడిగితే రెసిడెన్షియల్ కాలేజ్ ఇచ్చారని గుర్తు చేశారు. పట్టణానికి బీసీ, ఎస్సీ గురుకులాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్న ఆయన.. పాలకుర్తి మండలాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి కేసీఆర్ 5వేల ఇళ్లు ఇచ్చారని ఎన్నికల కోడ్ రావడంతో మిగతా వారికి ఇవ్వలేకపోయామని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ఏండ్లుగా పాలకుర్తి, చెన్నూరులో కాంగ్రెస్ నేతలే ఉన్నా ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. అందుకే వారి మాటలు నమ్మొద్దని హితవుపలికారు