పార్టీ మారేది లేదు.. పొత్తు పెట్టుకునేది లేదు: Eetala Rajender

Byline :  Bharath
Update: 2024-02-19 11:04 GMT

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కమలం పార్టీ సిద్ధమవుతోంది. రేపటి నుంచి (ఫిబ్రవరి 20) మార్చి 1వ తేదీ వరకూ తెలంగాణ బీజేపీ రథయాత్రలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ చేపట్టనున్న రథయాత్రలకు విజయ సంకల్ప యాత్రగా నామకరణం చేసింది. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు నిర్వహించి విజయ సంకల్పయాత్ర ప్రచార రథాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో విజయ సంకల్ప యాత్ర జరుగనుంది. 17 నియోజకవర్గాలను ఐదు క్లస్టర్లుగా విభజించి, మొత్తం 4,238 కిలోమీటర్ల మేర బీజేపీ రథయాత్రలు జరుగునున్నాయి. రేపు 5 క్లస్టర్లలో ఒకేసారి సంకల్ప యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ యాత్రల్లో అస్సాం, గోవా సీఎంలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లు పాల్గొననున్నారు. ఇక విజయ సంకల్ప యాత్ర ముగింపు ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరు కానున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతానంటూ కీలక ప్రకటన చేశారు. పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. త్వరలో పార్టీ మారబోతున్నారని వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుపైనా ఆయన స్పందించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రెండు పార్టీల మధ్య పొత్తు సాధ్యపడదని తేల్చిచెప్పారు. కొన్నేళ్ల కిందట బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ఈటల.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మల్కాజ్ గిరి స్థానంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు కన్నేశాయి. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. 

Tags:    

Similar News