Etela Rajender : కాంగ్రెస్ నేతలతో భేటీ.. ఈటల రాజేందర్ క్లారిటీ
కాంగ్రెస్ నేతలతో భేటీపై బీజేపీ నేత ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. తనను రాజకీయంగా బద్నాం చేయడానికే ఇటువంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ గృహప్రవేశం కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతో కలిసి భోజనం చేసినట్లు ఈటల తెలిపారు. ఆ ఫొటోపై దుష్ఫ్రచారం చేయడం తగదన్నారు. తాను బీజేపీని వీడి ఏ పార్టీలోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైన అసత్యాలు ప్రచారం చేయడం ఆపాలని కోరారు.
కాగా కాంగ్రెస్ నేతలతో ఈటల కలిసివున్న ఫొటో నెట్టింట వైరల్గా మారింది. ఈ ఫొటోలో ఈటలతో పాటు మైనంపల్లి హన్మంతరావు, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్లోకి వెళ్లడం ఖాయమైందని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నుంచి కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే బీఆర్‌ఎస్ నుంచి ఈటల రాజేందర్ బయటకు వచ్చిన అనంతరం, ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే చర్చ నడిచింది. కానీ, అనూహ్యంగా ఈటల.. బీజేపీలో చేరారు. ఈ క్రమంలో హుజురాబాద్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి ఈటల గెలుపొందారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈటల రాజేందర్ రెండు స్థానాల్లో(హుజురాబాద్, గజ్వేల్) పోటీచేసి ఓడిపోయారు. కాగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం వస్తే పోటీ చేస్తానని ఈటల ఇప్పటికే ప్రకటించారు.