అమిత్ షా సభ సాక్షిగా తెలంగాణ బీజేపీలో వున్న అంతర్గత విబేధాలు బయటపడ్డాయి. నేడు(ఆదివారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ కోసం ఖమ్మంలో భారీ ఏర్పాట్లు చేసారు. 'రైతు గోస-బిజెపి భరోసా' పేరిట నిర్వహిస్తున్న ఈ సభను తెలంగాణ బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఈ సభ కోసం ఏర్పాటుచేసిన ప్లెక్సీల్లో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫోటోలు లేకపోవడం వివాదానికి దారితీసింది. పార్టీ విజయం కోసం కష్టపడుతున్న నాయకుడికి బీజేపీలో దక్కే గౌరవం ఇదేనా అంటూ ఈటల వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమిత్ షా సభ జరిగే మైదానంలో ఏర్పాటుచేసిన ప్లెక్సీల్లో ఈటల రాజేందర్ ఫోటోలు లేవంటూ నిర్వహణ కమిటీ సభ్యులను ఈటల వర్గీయులు నిలదీసారు. ఈటలను అవమానించేలా వ్యవహరించడం సరికాదని... ఇలాగయితే అమిత్ షా సభను బహిష్కరిస్తామని ఈటల వర్గీయులు హెచ్చరించారు. ఇలా కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ జిల్లాల నుండి ఖమ్మం చేరుకున్న ఈటల వర్గీయులు నిర్వహణ కమిటీ సభ్యులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ ప్లెక్సీల వివాదం ముదరకుండా నిర్వహకులు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే ఈటల ఫోటోలతో కూడిన ప్లెక్సీలు ఏర్పాటుకు సన్నద్దమయ్యారు. సభ ప్రారంభమయ్యే సమయానికి ఈ ప్లెక్సీలు కనిపించేలా నిర్వహణ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నారు.