తెలంగాణ బీజేపీలో నేతల మధ్య సంధికాలం నడుస్తోంది. నిన్నమొన్నటి వరకు ఎడమొఖం, పెడమొఖంగా ఉన్న నేతలు.. పార్టీ కోసం రాజీపడి ఒక్కటి కానున్నారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నేడు భేటీ కానున్నారు. జితేందర్ రెడ్డి ఫామ్ హౌజ్‌లో ఈ భేటీ జరగనుంది. ఇటీవల సోషల్ మీడియాలో జరిగిన వార్‌కు తెరదించే ప్రయత్నం చేస్తున్నారు ఈటల. పార్టీలో అధ్యక్షుడి మార్పు ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో...ఇద్దరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది
4 రోజుల క్రితం జితేందర్ రెడ్డి తెలంగాణ బీజేపీ నేతలపై ట్వీట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ ట్వీట్‌కు ఈటల రాజేందర్ సైతం కౌంటర్ వేశారు. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. ఇతరుల స్వేచ్చ, గౌరవం తగ్గించకూడదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఈ రోజు వీరిద్దరూ భేటీ కానుండడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో అధ్యక్ష పదవి మారబోతుందన్న సంకేతాలతోనే ఈ భేటీ ఏర్పడిందని రాజకీయ నిపుణులు అంటున్నారు.
ఇటీవల ఢిల్లీలో టీ బీజేపీ పరిస్థితిపై అధిష్టానం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కె.లక్ష్మణ్, కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని బీజేపీ పరిస్ధితి, అధ్యక్ష పదవి మార్పు అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.