నేను ఓడినా.. అధికారులు నా మాట వినాల్సిందే : జగ్గారెడ్డి

By :  Krishna
Update: 2023-12-09 12:35 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. అధికారులు తన మాట వినాల్సిందేనని అన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలైన తన సతీమణిని అధికారిక కార్యక్రమాలకు పిలవాలని హుకుం జారీ చేశారు. బీఆర్ఎస్ హయాంలో తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ బీఆర్ఎస్ అధికారంలో ఉందని అప్పుడు ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థినే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించారని అన్నారు. అప్పుడు తాను హుందాగా వ్యవహరించానని.. ఈ సారి కూడా అలాగే చేయాలని తెలిపారు.

ఈసారి తాను ఓడినా తమ పార్టీ అధికారంలో ఉన్నందునా ప్రభుత్వ కార్యక్రమాలకు తన సతీమణిని పిలవాలని జగ్గారెడ్డి ఓ వీడియో విడుదల చేశారు.‘‘ నియోజకవర్గ అధికారులు నా ఆదేశాలను ఫాలో అవ్వాలి. విధుల్లో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దు. ఇక నుండి సంగారెడ్డి నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలకు నా సతీమణి నిర్మలా జగ్గారెడ్డిని పిలవాలి. నా తరుపున ఇక నుంచి ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి నా సతీమణి హాజరవుతారు. అధికారులు ఆమెకు సమాచారం ఇవ్వాలి’’ అని జగ్గారెడ్డి అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News