హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగర శివారుల్లోని ఎల్బీ నగర్ ఏరియాలోని 'కారోమెన్' అనే కార్ గ్యారేజీలో రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు భగ్గుమన్నాయి. ఈ ఘటనలో అక్కడ ఉన్న కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. షార్ట్ షర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దాని పక్కనే ఉన్న టింబర్ డిపోకు మంటలు వ్యాపించాయి. వెంటనే సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది రావడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చినా.. ఫలితం లేకుండా పోయింది. అప్పటికే చాలా కార్లు మంటల్లో కాలిపోయాయి. మూడు ఫైర్ స్టేషన్ నుండి ఫైర్ ఇంజిన్ లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తుంది.
రెండ్రోజుల ముందే రిపేర్ కోసం వచ్చిన 10 నుంచి 20 కార్లు మంటల్లో దగ్ధమైనట్లు సమాచారం. సుమారుగా 50కు పైగా కార్లు మంటల్లో కాలినట్లుగా తెలుస్తుంది. మంటలకు టైర్లు, కార్ల పెట్రోల్ ట్యాంకులు పేలడంతో భారీ శబ్దాలు వినిపించాయి. గ్యారేజీలో సిలిండర్లు కూడా ఉండటంతో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసి పడటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకున్నది. దీంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. టింబర్ డిపో నుంచి చుట్టుపక్కల మంటలు అంటుకోగానే.. అపార్ట్‌మెంట్లలోని ప్రజలంతా అందరూ బయటికి వచ్చేశారని అధికారులు చెబుతున్నారు.
చుట్టుపక్కన నివాసాలు ఉండటంతో.. మంటలు అపార్ట్‌మెంట్లకు వ్యాపించకుండా అధికారులు ప్రయత్నాలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకు వచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా, టింబర్ డిపో చుట్టుపక్కల వారిని ఇండ్ల నుంచి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉందని డీసీపీ సాయి శ్రీ తెలిపారు.