ఒంటిని విరిచేసినట్టు భరించలేని నొప్పులతో అతలాకుతలం చేసే చికున్‌గున్యా వ్యాధి ఇక తోక ముడవనుంది. ఈ వ్యాధిని నివారించే తొలి వ్యాక్సీన్‌కు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. యూరప్‌కు చెందిన ఫార్మా కంపెనీ వాల్నెవా ‘ఇక్స్‌చిక్’ పేరుతో ఈ టీకాను తయారు చేసింది. క్లినికల్ పరీక్షల్లో ఈ మందు శక్తిమంతంగా పనిచేయడంతో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. టీకాను 18 ఏళ్లు దాటిన వారు మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఒక డోసు మాత్రమే. దోమలతో వ్యాపించే చికున్‌గున్యాకు ప్రస్తుతానికి ఎలాంటి మందూ లేదు. ఈ వ్యాధి సోకితే తీవ్రజ్వరం, కీళ్ల నొప్పులు వస్తాయి. తేమ వాతావరణం ఉండే దేశాల్లో ఎక్కువ కేసులు నమోదవుతుంటాయి. ద్రవపదార్థాలతోపాటు నొప్పులకు, జ్వారానికి మందులు తీసుకుంటే తగ్గిపోతుంది.