తొలిపూజకు సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు.. పాల్గొననున్న గవర్నర్..
ఖైరతాబాద్ మహాగణపతి తొలిపూజకు సిద్ధమయ్యాడు. ఉదయం 9.30కు తొలిపూజను అందుకోనున్నాడు. తొలిపూజలు గవర్నర్ తమిళిసై దంపతులు పాల్గొంటారు. ఆ సారి శ్రీ దశవిద్య మహాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి.. ఎడమవైపు వీరభద్ర స్వామి విగ్రహాలు ఉన్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవకమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.
మరోవైపు ఖైరతాబాద్ గణపతి రికార్డ్ సృష్టించాడు. 63 అడుగుల ఎత్తు గల మట్టి విగ్రహంగా వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటికే మహాగణపతి వద్ద భక్తుల సందడి నెలకొంది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు సుమారు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. 1954లో సింగరి శంకరయ్య అనే వ్యక్తి స్థానిక ఆలయంలో ఒక అడుగు గణపయ్యను ప్రతిష్టించి పూజలు చేశారు. అప్పటినుంచి ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుతూ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు.