ఫలక్‌నుమా రైలు ప్రమాదానికి కారణాన్ని గుర్తించిన ఫోరెన్సిక్‌..!

Update: 2023-07-08 16:10 GMT

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం ఉదయం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డా నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు..యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పురపాలిక పరిధిలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి శివారులో ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా రైలు నుంచి మంటలు రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. అందరూ సకాలంలో కిందకు దిగిపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు.పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో దాదాపు ఏడు బోగీలు దగ్ధమయ్యాయి.

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై రైల్వే శాఖ విచారణ చేపట్టింది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. ఇక ప్రమాదంలో కాలిపోయిన 5 బోగీలను క్లూస్‌ టీమ్‌ శనివారం పరిశీలించింది.

విద్యుత్‌ సరఫరాలో హెచ్చుతగ్గులు లేదా, ఓవర్‌ హీట్‌ వల్ల వైర్లలో మంటలు వచ్చి ఉండొచ్చని క్లూస్‌ టీమ్‌ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఎస్‌4 బోగీలోని బాత్రూం వద్ద మొదట విద్యుత్ ఘాతం జరిగినట్టు భావిస్తున్నారు. ఎస్‌4 బోగీ నుంచి మిగిలిన బోగీలకు మంటలు వ్యాపించినట్లు క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. వందకు పైగా నమూనాలను సేకరించింది. నమూనాలను ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీకి పంపించారు. నివేదిక వచ్చిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు కచ్చితంగా తెలిసే అవకాశముంది.

Tags:    

Similar News