Revanth Reddy : మరికాసేపట్లో యశోద ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించనున్నారు. కేసీఆర్ ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్ళి బీఆర్ఎస్ అధినేతను పరామర్శించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మరికొందరు మంత్రులు కూడా యశోద హాస్పిటల్ కు చేరుకొని కేసీఆర్ ను పరామర్శించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ హాస్పిటల్ కు చేరుకున్నారు.
శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ నిర్వహించింది. ఆ తర్వాత ఆయనను పలువురు నాయకులు ఆసుపత్రిలో పరామర్శిస్తున్నారు. కేసీఆర్‌కు హిప్ రిప్లేస్‌మెంట్ ఆపరేషన్ విజయవంతమైందని, ఆయన కోలుకుంటున్నారని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వాకర్ సాయంతో కేసీఆర్ నడుస్తున్నారని చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వారు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, త్వరగా కోలుకోవడానికి అనుకూలంగా శరీరం సహకరిస్తోందన్నారు. మానసికంగా కూడా కేసీఆర్ దృఢంగా ఉన్నారని తెలిపారు.
గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేసీఆర్ ఎర్రవల్లి గ్రామంలోని తన ఫామ్‌హౌస్‌లో జారిపడ్డారన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన తుంటికి గాయమైంది.హుటాహుటిన యశోదా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే.. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి వివరాలు వివరాలు ఆరా తీసారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం తానే స్వయంగా యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ని పరామర్శించనున్నారు.