KCR : బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌!

Byline :  Bharath
Update: 2023-12-09 02:58 GMT

బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు తెలుస్తుంది. ఇవాళ (డిసెంబర్ 9) ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ పార్టీ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ను ఎన్నుకోనున్నారు. అసెంబ్లీ పక్ష నేతలుగా కేటీఆర్, హరీశ్ రావుల్లో ఒకరికి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. కుటుంబ సభ్యులను కాదనుకుంటే.. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి అవకాశం ఉంది. శాసనసభా పక్షనేతగా తానే ఉంటానని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ.. ప్రతిపక్ష హోదాను సొంతం చేసుకుంది.

ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కాలు జారి కిందపడ్డ కేసీఆర్ కు.. తుంటి ఎముక శస్త్రచికిత్స జరిగింది. ఆ కారణంగా ఇవాళ జరిగే సమావేశానికి హాజరు కావట్లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ జరిగే ముందు.. ఇవాళ ఎల్పీ సమావేశం నిర్వహించాలని కేటీఆర్, హరీశ్ రావులకు కేసీఆర్ సూచించారు. కాగా మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో నిర్వహించే సమావేశంలో పాల్గొని.. కేసీఆర్‌ను తమ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటారు. అయితే కేసీఆర్ బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నికైనా.. ఇప్పట్లో అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు. నిన్న జరిగిన శస్త్రచికిత్స కారణంగా ఆయన కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు సమయం పట్టొచ్చని డాక్టర్లు సూచించారు. దాంతో కేసీఆర్ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేయట్లేదు. మిగిలిన ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.




Tags:    

Similar News