త్వరలోనే కాంగ్రెస్‌లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జగ్గారెడ్డి
తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ తమను ఎన్నో ఇబ్బందలకు గురి చేసిందని అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పోలీసులను అడ్డు పెట్టుకుని తమను గడ్డపారతో పొడిచినంత పని చేశారని ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో 20 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని .. ఈ విషయం గురించి ఇంతకుముందు కూడా చెప్పానన్నారు. అతి కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరికపై తాను కాన్ఫిడెంట్‌గా ఉన్నానని అన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తమ పార్టీలోకి రావొచ్చని జోస్యం చెప్పారు. ఇక లోక్‌సభ ఎన్నికల విషయంపై మాట్లాడుతూ.. తాను మెదక్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని అన్నారు. ఒక వేళ రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే.. తాను పొటీకి సిద్ధమని అన్నారు. అంతకుముందు గాంధీభవన్‌లో మాట్లాడిన జగ్గారెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ రూ.60 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిందని జగ్గారెడ్డి ఆరోపించారు. తన దగ్గర కూడా అంత డబ్బు ఉంటే బీఆర్ఎస్ నేతలకు చుక్కలు చూపించేవాడనన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలను బీఆర్ఎస్ టార్గెట్ చేసిందని ఆరోపించారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ రెడ్డి చేతిలో జగ్గారెడ్డి ఓటమి పాలైన సంగతి తెలిసిందే.