Nagam Janardhan Reddy: కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల వేళ టీ- కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాగర్ కర్నూల్ టికెట్ ఆశించి భంగపడ్డ నాగం.. టికెట్ దక్కకకపోవడంతో తీవ్ర అసంతృప్తి గురై హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుండి బరిలోకి దిగాలనుకున్నారు నాగం. కానీ అధిష్టానం ఆయన్ను కాదని.. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కొడుకు కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి టికెట్ కేటాయించింది. దీంతో నాగం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏళ్లుగా కష్టపడుతున్నవారిని మోసం చేసి, అవసరం కోసం పార్టీలో చేరిన పారాచూట్ నేతలకే టికెట్లు ఇచ్చిందని నాగం జనార్దన్‌రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నాశనం చేశారన్నారు.
సీనియర్ నేతనైన తనను కాకుండా మరో(బీఆర్ఎస్) పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతకు టికెట్ కేటాయించడంతో తీవ్ర అసంతృప్తి గురై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన నాగం.. ఇవాళ సాయంత్రం బీఆర్ఎస్ లో చేరునున్నట్లు సమాచారం. నాగం జనార్ధన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 5:00 గంటలకు నాగం నివాసానికి మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నాగం జనార్ధన్ రెడ్డిని కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ప్రకటనతో అసంతృప్త జ్వాలలు బయటపడుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు.. ఇప్పటికే కొందరు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పగా.. మరికొందరు సైతం నాగం బాటలోనే నడవనున్నట్లు సమాచారం.