హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటే.. Harish Rao

Byline :  Veerendra Prasad
Update: 2024-02-27 11:34 GMT

కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా లే అవుట్​ రెగ్యులేషన్స్ స్కీంను(LRS) ఉచితంగా అమలు చేయాలని లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో హరీశ్​రావు ఎక్స్ వేదికగా స్పందించారు. హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది అని మండిప‌డ్డారు. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పింద‌ని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ పేరిట ఫీజు వ‌సూలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధ‌మైంద‌న్నారు. నో ఎల్ఆర్ఎస్ - నో బీఆర్ఎస్ అంటూ గతంలో ప్రజలను రెచ్చగొట్టి ఇప్పుడు ఎల్ఆర్ఎస్​కు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనమని హరీశ్​రావు అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ఆదాయ సమీకరణ సమీక్షాసమావేశంలో ఎల్​ఆర్​ఎస్​పై కీలక​ నిర్ణయాలను వెల్లడించారు. తెలంగాణ లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం దరఖాస్తులపై చేసిన ప్రకటనతో, ఎంతోమంది గత మూడున్నరేళ్ల ఎదురుచూపులకు తెరదించినట్లైంది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్‌లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇప్పుడు కల్పించారు. మార్చి 31 లోపు మొత్తం ఫీజు చెల్లించిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వనున్నారు. దేవాదాయ, వక్ఫ్‌, గవర్నమెంట్, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు మినహా ఇతర లేఅవుట్‌లను క్రమబద్ధీకరించనున్నారు. గతంలో రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వనున్నారు. నగర, పురపాలికలు, పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్లికేషన్లు ఆహ్వానించడంతో 25 లక్షలకు పైగా అందాయి.

ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ మధ్యంతరంగా నిలిచిపోయింది. రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పెండింగులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని అప్పట్లో ఆయన చెప్పారు. కాగా ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది. దీనిపై తాజాగా హరీశ్​రావు ట్విటర్​ వేదికగా స్పందించారు.

Tags:    

Similar News