అప్పులు తెచ్చినం.. వాటిలో సగం తీర్చేసినం - జగదీశ్ రెడ్డి

By :  Kiran
Update: 2023-12-21 09:23 GMT

కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఆరోపణలకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఈ క్రమంలో వారిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా మాటల తూటాలు పేలాయి. తనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన జగదీశ్ రెడ్డి సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమని సవాల్‌ విసిరాడు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు.

రాష్ట్రంలో విద్యుత్‌ రంగాన్ని బలోపేతం చేసేందుకు అప్పులు తెచ్చామని.. వాటిలో సగానికిపైగా తీర్చేశామని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. శాసన సభలో విద్యుత్‌ రంగంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో విద్యుత్‌ రంగ పరిస్థితిని సభకు వివరించారు. ఆనాడు తెలంగాణ రైతాంగం పరిస్థితి దారుణంగా ఉండేదని బండెడ్ల నుంచి పుస్తెలు వరకు అమ్మకుని బోర్లు వేసేవారని, చివరకు భూమి అమ్ముకునే దుస్థితి వచ్చేదని అన్నారు. 10, 20 ఎకరాలు ఉన్న రైతులు కూడా వ్యవసాయం చేయలేక కూలీ పనుల కోసం వలస వచ్చిన పరిస్థితులు ఉన్నాయని జగదీశ్ రెడ్డి అన్నారు.

స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్‌ ఉత్పత్తి చేయడం కష్టంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేశామని జగదీశ్ రెడ్డి చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి గ్రిడ్‌ అనుసంధానం చేసి విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేశామని అన్నారు. తొలుత గృహ, వాణిజ్య అవసరాలకు 24 గంటల కరెంటు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. వ్యవసాయానికి మొదట ఆరు గంటలు ఆ త్రవాత 9 గంటల కరెంటు ఇచ్చామని, రెండేళ్లలో రైతాంగానికి 24 గంటల విద్యుత్‌ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని జగదీశ్ రెడ్డి సభకు వివరించారు.


Tags:    

Similar News