Malla Reddy:భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి రియాక్షన్ ఇదే
భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. భూ కబ్జాతో తనకు ఎటువంటి సంబంధం లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.ఇది ప్రభుత్వ కక్ష చర్య కాదని, కేసు నమోదైన విషయం వాస్తవమని చెప్పారు. తాను కూడా కోర్టును ఆశ్రయిస్తాని మాజీ మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు.
గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శామీర్‌పేట్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్టీ (లంబాడీల) వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారు. దీనికి సంబంధించి శామీర్‌పేట పోలీస్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు.
మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డిసిఏంఎస్)జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు 420 చీటీంగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.