మళ్లీ సంగారెడ్డిలో పోటీ చేయను, రాజకీయాలు చేయను.. Jaggareddy
భవిష్యత్‌లో సంగారెడ్డిలో పోటీ చేయనని, ఒకరి వద్ద లాలూచీ రాజకీయం చేయనని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇక నుంచి తన లైన్ పూర్తిగా పార్టీ లైన్‌లోనేనని, పార్టీ కోసమే పని చేస్తానని తెలిపారు. ఇక సంగారెడ్డిలో కూడా రాజకీయాలు చేయనని, పార్టీ కోసమే పని చేస్తానని చెప్పుకొచ్చారు. తాను ఓడిపోవడం వల్ల సంగారెడ్డి ప్రజలే బాధపడుతున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో ఓడిపోతానని ఆరు నెలల ముందే తనకు తెలుసని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నానని డిసెంబరు 1 నాడే రేవంత్‌రెడ్డికి ఫోన్‌లో చెప్పినట్లు జగ్గారెడ్డి.. గాంధీభవన్‌లో మీడియాకు చెప్పారు. ఇక సంగారెడ్డిలో పోటీచేయనని, సంగారెడ్డిని వదిలేసి రాష్ట్రమంతా తిరిగి పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు. సంగారెడ్డి ప్రజలు తాను అందుబాటులో ఉండనని బీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని నమ్మారని, అలాంటప్పుడు వారిని ఎందుకు ఓట్లడగాలి? అని అన్నారు.
తనను ఓడించడానికి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao)రూ.60 కోట్లు ఖర్చు చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం వస్తుందని, రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఆనాడే తనకు తెలుసని చెప్పారు. ఎన్నికల్లో గెలిస్తే మంత్రి అవుతానన్న విషయం కూడా తనకు తెలుసునని పేర్కొన్నారు. సంగారెడ్డికి తాను ఎమ్మెల్యే అయిన తర్వాతనే అభివృద్ధి జరిగిందని జగ్గారెడ్డి తెలిపారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంతో పని చేయించానని గుర్తు చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేయాలని తనకైతే లేదు. పార్టీ ఏం నిర్ణయిస్తే అది జరుగుతుందని అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు పరోక్షంగా చెప్పారు.