టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. హాజరుకానున్న మీరా కుమార్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీపీసీసీ వినూత్న కార్యక్రమాలకు సిద్ధమైంది. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు పూర్తైన సందర్భంగా పాదయాత్ర నిర్వహించనుంది. బషీర్ బాగ్ నుంచి ప్రారంభంకానున్న ఈ యాత్ర గన్ ఫౌండ్రీ, ఆబిడ్స్, మొజంజాహి మార్కెట్ మీదుగా గాంధీ భవన్ చేరుకుంటుంది. అనంతరం గాంధీ భవన్లో తెలంగాణ ఆవిర్భవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే హాజరుకానున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖులకు సన్మానం చేయనున్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్ లో నేతలు జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. ఉ. 11.00 గంటలకు లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, పార్టీ సీనియర్ నాయకులు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. ఉ. 11.15 గంటలకు నిజాం కాలేజ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మీరాకుమార్ పాదయాత్ర ప్రారంభిస్తారు.
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన స్వరాష్ట్ర ఏర్పాటును సోనియాగాంధీ నెరవేర్చారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. దశాబ్దాల కల నెరవేర్చిన కాంగ్రెస్ కు రాష్ట్ర ప్రజలు మద్దతివ్వాలని కోరారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ చేపట్టనున్న కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.