దోమలగూడ గ్యాస్ లీకేజీ.. ఒకే కుంటుంబానికి చెందిప నలుగురు
హైదరాబాద్ లోని దోమలగూడ రోజ్ కాలనీలో 4 రోజుల క్రితం ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన విషయం తెలిసిందే. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో పిండి వంటలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దాంతో ఆ ఇంట్లో ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్భంది మంటలను అదుపు చేశారు. తర్వాత క్షతగాత్రులను గాంధీ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు.
కాగా, ఆ ఘటనలో గాయపడిన ఏడుగురిలో ఒకరు రెండు రోజుల క్రితం చనిపోగా.. ఇవాళ (జులై 14) మరో ముగ్గురు మరణించారు. ధనలక్ష్మి (28), శరణ్య (11), అభినవ్ (7), పద్మ (53) చనిపోయినట్లు గాంధీ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. మిగిలిన ముగ్గురి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు చెప్పున్నారు. ఒకే కుటుంబం నుంచి నలుగురు చనిపోయే సరికి బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.