ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక.. తన పాటతో కోట్లాది మందిని ఉద్యమం వైపు నడింపించారు. ఉద్యమ స్పూర్తికి ఆయన గళాన్ని కలిపిన గద్దర్ అంతిమయాత్ర ప్రారంభం అయింది. ఎల్బీ స్టేడియం నుంచి మొదలైన ఆయన అంతిమయాత్ర ప్రస్తుతం గన్ పార్క్ మీదుగా సాగుతోంది. ఆ తర్వాత అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం, ట్యాంక్ బండ్ మీదుగా అల్వాల్‌లోని ఆయన నివాసానికి చేరుకుంటుంది. అల్వాల్‌లోని గద్దర్ నివాసం వద్ద ఆయన పార్థివ దేహాన్ని కొంతసేపు ఉంచిన తర్వాత.. ఆయన స్థాపించిన మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
గద్దర్ అంతిమయాత్రకు ప్రజలు, కళాకారులు భారీగా తరలివచ్చారు. ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమంలో ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిదంటూ కొనియాడారు. భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఆయన ఉద్యమ పాటలతో నివాళులు అర్పించారు. మద్యాహ్నం మూడు గంటలకు జరగబోయే అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. గద్దర్ నివాసం వద్ద ఆయనకు నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గొంటారు.