కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పీసీసీ ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గాలి అనిల్‌కుమార్‌ను మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌కు అనిల్ రాజీనామా చేసి 24 గంటలు గడవకముందే ఇవాళ తెల్లవారుజామున ఆయన ఇంటికి మంత్రి హరీశ్ వెళ్లారు. అక్కడే బ్రేక్ ఫాస్ట్ చేసిన మంత్రి.. BRSలోకి రావాలని అనిల్‌ను ఆహ్వానించారు. దానికి సానుకూలంగా స్పందించారు అనిల్ కుమార్. ఈరోజు(గురువారం) సీఎం కేసీఆర్ సమక్షంలో నర్సాపూర్‌లో జరిగే సభలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు.
అంతకుముందు.. బీసీలకు అన్యాయం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు అనిల్‌కుమార్. బుధవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీసీలకు 34 అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పి.. అన్యాయం చేశారన్నారు. అయిదేళ్లుగా నర్సాపూర్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయగా.. కొత్తగా చేరినవారికి టికెట్ ఇచ్చి తనకు అన్యాయం చేశారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వారికి పార్టీలో సరైన గౌరవమర్యాదలు, ప్రాధాన్యతలు దక్కడం లేదన్నారు. తాను పార్టీ కోసం పనిచేసి అన్ని విధాలుగా నష్టపోయినట్టుగా తెలిపారు. కార్యకర్తలు, అభిమానుల ఒత్తిడి మేరకు, వారి మనోభావాలను గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్యానికి, పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నానని చెప్పారు.