GHMC అలర్ట్.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

సహాయం కోసం ఈ నంబర్‌కు డయల్ చేయండి

By :  Lenin
Update: 2023-07-20 05:33 GMT


గ్రేటర్ హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. మరో రెండ్రోజులు అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ (Mayor Gadwal Vijayalakshmi) జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్‌టీంలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని నగర వాసులకు విజ్ఞప్తి చేశారు. వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ టోల్ ఫ్రీ నెంబర్ 9000113667ను ఏర్పాటు చేశారు.

మరోవైపు ఎడతెరపి లేకుండా కురుస్తున్న నగరంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు వరదనీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుత్బుల్లాపూర్, గాజులరామారం, జీడిమెట్ల, కూకట్‌పల్లి, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మెహదీపట్నం, కోఠి, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని టోలీచౌకి మరోసారి నీటమునిగింది. నిజాం కాలనీ, మీరాజ్ కాలనీ లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. టోలిచౌకి ఫ్లైఓవర్ కింద డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.


Tags:    

Similar News