భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో ఉధృతంగా గోదావరి నది ప్రవహిస్తోంది. దీంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు నీటిమట్టం 44.4 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అనంతరం రాత్రి 9.45 గంటలకు వరద ప్రవాహం 48 అడుగులకు చేరడంతో రెండవ హెచ్చరికను జారీ చేశారు. వరద కారణంగా పట్టణంలోని ఆలయాలు, సత్రాలు సహా లోతట్టు ప్రాంతాలకు కూడా వరద నీరు చేరింది.
ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రాణహిత, ఇంద్రవంతి, పెన్‌గంగా, తాలిపేరు, కిన్నెరసాని, శబరి వంటి గోదావరికి ఉప నదులతో పాటు వాగులు , వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక నాన్ స్టాప్‌గా కురుస్తున్న భారీ వర్షాలనేపథ్యంలో అటు శ్రీరాంసాగర్‌కు వరద నీరు పోటెత్తుతోంది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు గేట్లు ఏ క్షణమైనా ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రాణహితలో మాత్రం వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలోనూ కురుస్తున్న వానలతో కృష్ణా బేసిన్‌లో ఎగువన ఉన్న ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులు వరద నీటితో జలకళను సంతరించుకుంటున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సైతం స్వల్పంగా వరద చేరుతోంది. వరద కారణంగా ఇటు మూసీ ఏడు గేట్లను కూడా అధికారులు ఎత్తారు.