హైదరాబాద్‌లో నివసించే పేద ప్రజలకు సొంత గూడు ఉండాలనే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా మొదటి దశలో సెప్టెంబర్ మొదటి వారంలోనే 24 నియోజకవర్గాల నుంచి 11,700 మంది లబ్ధిదారుల సొంతింటి కళను నెరవేర్చింది సర్కార్. ఈ క్రమంలోనే తాజాగా 2వ దశ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 21వ తేదీన దాదాపు 13,300 ఇండ్లను పేద ప్రజలకు అందించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అనౌన్స్ చేశారు. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం అస్సలు ఉండదని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంపై ఇవాళ సెక్రటేరియట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..."సెప్టెంబర్ 21న దాదాపు 13,300 ఇండ్లను పేద ప్రజలకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం అస్సలు ఉండదు. అర్హులను ఎంపిక చేసే పూర్తి బాధ్యతను ప్రభుత్వం అధికారులకే అప్పగించాం. కంప్యూటర్ ఆధారిత డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉంటుంది. పేద ప్రజలకు మాత్రమే లబ్దిచేకూరేలా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందిస్తున్నాం. మొదటి దశలో నగరంలో 11,700 ఇళ్లను అందించాం. అవకతవకలు జరిగితే పూర్తి బాధ్యత అధికారులదే. ఎలాంటి తప్పు జిరిగినా అధికారులను తమ ఉద్యోగం నుంచి తీసి వేసే స్థాయిలో కఠినంగా చర్యలు తీసుకుంటాం"అని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.