Google Map: గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యాడు.. చివరకు ఏం జరిగిందంటే..
ఏదైనా కొత్త ప్లేస్‌కు వెళ్లినప్పుడు కరెక్ట్ అడ్రస్, రూట్ తెలియనప్పుడు గుర్తొచ్చే ఒకే ఒక్క ఆప్షన్ గూగుల్ మ్యాప్స్(Google Maps). ఒకప్పుడైతే దారి వెంట వచ్చేవాళ్లనో, లేదంటో ఎదురుపడిన వాళ్లనో అడ్రస్ కనుక్కోవాల్సిన పరిస్థితి. ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువవడంతో చాలా మంది గూగుల్ మ్యాప్‌నే సెలక్ట్ చేసుకుంటున్నారు. జస్ట్ లొకేషన్ ఆన్ చేస్తే మనం వెళ్లాల్సిన అడ్రస్‌కు దారి చూపిస్తుంది గూగుల్. అలా అని.. ప్రతీసారి ఈ గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకోవడం కరెక్ట్ కాదు. చాలా సందర్భాల్లో గూగుల్ మ్యాప్స్‌లో ఉన్న ఎర్రర్స్ కారణంగా చాలా మంది రాంగ్ అడ్రస్‌లకు వెళ్లి ఇబ్బందులు పడ్డ ఘటనలు ఉన్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా గౌరవెల్లి ప్రాజెక్టు దగ్గర ఇలాంటి ఘటనే జరిగింది.
గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని ఓ డ్రైవర్ డీసీఎంను ఉమ్మడి మెదక్ జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టులోకి తీసుకెళ్లాడు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. పాల ప్యాకెట్ కవర్ లోడ్‌తో హుస్నాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళుతూ, డ్రైవర్‌కు కరెక్ట్ రూట్ తెలియక.. స్మార్ట్ ఫోన్లో గూగుల్ రూట్ మ్యాప్ చూసుకొని వాహానాన్ని నడిపారు. నందారం స్టేజి దాటిన తర్వాత సూటిగా రోడ్డు ఉందని గూగుల్ మ్యాప్ చూపగా, చీకట్లో డీసీఎంను నడుపుతూ అలాగే వెళ్లారు.
ఇటీవల కురిసిన వానల వల్ల రోడ్లపై నీరు నిలిచి ఉంటుందనుకుని భావించి.. ఇంకాస్త ముందుకు వెళ్లగానే లోతు పెరిగింది. దీంతో వ్యాన్ క్యాబిన్లోకి నీళ్లు చేరి వాహనం నిలిచిపోయింది. వెంటనే గమనించిన డ్రైవర్... ఆ వాహనంలో ఉన్న మిగతా ముగ్గురు మెల్లగా దిగి నీటిలో ఈదుకుంటూ సమీపంలోని జలు బాయ్ తండాకు వెళ్లారు. జరిగినదంతా స్థానిక గ్రామస్థులకు తెలపగా వారు అవాక్కయ్యారు. ఆ తర్వాత గ్రామస్థులే వ్యాన్‌కు తాళ్లు కట్టి జేసీబీ సహాయంతో వెనక్కి లాగడంతో అతి కష్టం మీద బయటకు వచ్చింది.