జైపూర్ – ముంబై రైలులో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పుల్లో మరణించిన సైఫుద్దీన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. సైఫుద్దీన్ భార్య అంజుమ్ షాహీన్‌కు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. కులీకుతుబ్ షా పట్టణాభివృద్ధి సంస్థలో ఆఫీస్ సబార్డినేట్ జాబ్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు జియగూడలో డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించనున్నారు. వితంతు పెన్షన్ తో పాటు సైఫుద్దీన్ ముగ్గురు కుమార్తెలకు బీఆర్ఎస్ పార్టీ తరపున రూ. 2 లక్షల చొప్పున, మజ్లిస్ తరపున రూ. 1 లక్ష చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నారు.
జులై 31న జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఆర్పీఎఫ్ ఏఎస్ఐతో పాటు ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపాడు. వారిలో హైదరాబాద్ ఏసీ గార్డ్స్ కు చెందిన సైఫుద్దీన్ కూడా ఉన్నారు. కాల్పుల ఘటనకు సంబంధించి చేతన్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.