బీఆర్ఎస్‌కు ఓటు వేస్తేనే ప్రభుత్వ పథకాలు.. MLA సంచలన వ్యాఖ్యలు

By :  Lenin
Byline :  Veerendra Prasad
Update: 2023-09-03 01:41 GMT

బీఆర్ఎస్ నేత, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో రెడ్యా నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమకు ఓటు వేసినవారికి మాత్రమే ప్రభుత్వ పథకాల్లో చోటు ఉంటుందని వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో రెడ్యా నాయక్ మాట్లాడుతుండగా ఆయన ప్రసంగానికి కొంతమంది యువకులు అడ్డు తగిలారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమావేశంలో ఉద్రిక్తలకు కారణమైన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రెడ్యా నాయక్ ప్రసంగం సాగింది.

రెడ్యా నాయక్ ఇలాంటి కాంట్రవర్సీ కామెంట్లు చేయడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు వివాదాస్పద కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. గత కొద్దిరోజుల క్రితం సరిగ్గా పనిచేయని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. సరిగ్గా పనిచేయని అధికారులను ఆడవాళ్లతో తన్నిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇటీవల నియోజకవర్గంలో రెడ్యా నాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఫిర్యాదు చేశారు. కొద్దిరోజుల క్రితమే మిషన్ భగీరథ పనుల కోసం రెడ్యా నాయక్ రూ.5 లక్షలు మంజూరు చేయించారు. కానీ పనులు పూర్తిచేయకపోవడంతో అధికారుల తీరును తప్పుబట్టారు.



Tags:    

Similar News