ఆర్టీసీ బిల్లుకు తమిళిపై ఓకే.. సర్కారుతో కొత్త మైత్రి ఫలితమే!

Update: 2023-09-14 07:18 GMT

రాజ్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.. అనేది పాతమాట! రెండింటి మధ్య ఇప్పుడు సౌహార్ద పుష్పాలు వెల్లివిరుస్తున్నాయి. సీఎం కేసీఆర్ చాణక్యం, గవర్నర్ తమిళిసై పంతం మధ్య చక్కగా రాజీకుదిరింది. ఎవరి వ్యూహాలకు తగ్గట్లు వారు పట్టువిడుపులు ప్రదర్శిస్తూ మొత్తానికి ఆర్టీసీ బిల్లును గట్టెక్కించారు. బిల్లుపై నానా కొర్రీలు పెట్టి ప్రభుత్వంతో చేంతాడంత వివరణలు, సమాధానాలు ఇప్పించుకున్న తిమిళిసై.. ప్రభుత్వ వివరణలతో తృప్తి చెందానంటూ ఆమోద ముద్ర వేశారు. నిజానికి రెండు రోజుల ముందే ఆమె ఆర్టీసీ జేఏసీ నేతలు కలిసినప్పుడు రెండు రోజుల్లో బిల్లును ఆమోదిస్తానని చెప్పారు. మాట నిలబెట్టుకుని గురవారం రాజముద్ర ఒత్తారు. ఆర్టీసీ ఉద్యోగల సంక్షేమం కోసమే తను బిల్లును పెండింగులో పెట్టినట్లు వాదిస్తూ ఉద్యోగులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.

కేసీఆర్ బలమైన నాయకుడంటూ...

ఆర్టీసీ బిల్లును పెండింగులో పెట్టి విమర్శలు ఎదుర్కొన్న తమిళిసై కొన్నిరోజులుగా మెత్తబడుతూ వస్తున్నారు. కేసీఆర్ కూడా ఆమెను విస్మరించకుండా కార్యక్రమాలకు పిలుస్తూ సముచితగా గౌరవిస్తున్నారు. ఆయన ఆహ్వానంపై గవర్నర్ కొత్త సచివాలయంలోని ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవానికి వెళ్లారు. సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను ఆహ్వానించని కేసీఆర్ మందిరాల కార్యక్రమానికి పిలవడం, ఆమె గత చేదు అనుభవాలను మరచిపోయి వెళ్లడం గమనార్హం. తెలంగాణ గవర్నర్‌గా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఆమె సీఎంపై ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ బలమైన నాయకుడని, ఎంతో అనుభం ఉన్న ఆయనను చూసి చాలా నేర్చుకున్నానని అన్నారు. రాజ్‌భవన్, ప్రగతిభవన్‌కు మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేదన్నారు. తన పట్టును కూడా ప్రదర్శిస్తూ.. ఏ బిల్లుపై కూడా అలా గుడ్డిగా సంతకం చేననని, బిల్లును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఉద్యోగుల భావోద్వేగపు అంశమని, దానికి తను అడ్డుపడనని చెప్పారు.

పట్నం మహేందర్ రెడ్డితో మంత్రిగా ప్రమాణం చేయించిన సందర్భంలోనూ కేసీఆర్, తమిళిసై ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత రాజ్ భవన్‌లో అడుగుపెట్టిన కేసీఆర్ పాత గొడవలను మర్చిపోయినట్లే కనిపించారు. పట్నం ప్రమాణం స్వీకారం తర్వాత ప్రత్యేకంగా సమావేశంపై ఆయా అంశాలపై చర్చించారు. ఆర్టీసీ బిల్లు సహా పలు అంశాపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తెలంగాణను బిల్లును ఆవిష్కరించారు..

ఎన్నికలు.. ఏ ఏడాది..

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిపించే బాధ్యతతోపాటు పరిపాలన వంటి పలు అంశాలపై సీఎం, గవర్నర్ కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం నెలకొంది. తెగేదాకా లాగితే సమస్యలు పరిష్కారం కాకపోగా ప్రతిష్ట కూడా దెబ్బతినే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ముగిసేలోపు సమస్యల పరిష్కారానికి ఇద్దరూ పట్టుసడించారు. తమిళిసై పదవీ కాలం మరో ఏడాదితో ముగియనుండడంతో ఆమెతో అనసరమై వివాదాలు ఎదుంకని ప్రభుత్వం, వెళ్తూవెళ్తూ చెడ్డపేరు ఎందుకని తమిళిపై సయోధ్యకు వచ్చినట్లు కనిపిస్తోంది.



Tags:    

Similar News