Governor Vs KCR : ఆర్టికల్ 175 (2): కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై కొత్త అస్త్రం!!
గత కొంతకాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ (Governor Vs KCR ) తమిళిసైల మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో ఈ విషయం బహిరంగంగానే వ్యక్తమైంది. అయితే తాజాగా కేసీఆర్ సర్కార్‌పై గవర్నర్ తమిళిసై రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 175(2)ను ప్రయోగించారు. ఇది గతంలో చాలా అరుదుగా ఉపయోగించబడింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ రాజ్యాంగ నిబంధన మేరకు.. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా పెండింగ్ బిల్లులపై తమిళిసై రాష్ట్ర శాసనసభ ఉభయ సభలకు సందేశం పంపారు. అయితే సాధారణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా గవర్నర్లు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతారు. అయితే రాజ్యాంగ నిబంధను ఉపయోగించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సందేశం పంపడం అనేది అరుదైన ఘటన అని నిపుణులు చెబుతున్నారు.
ఆర్టికల్ 175 (2) విషయానికి వస్తే.. ఇది శాసన సభ, శాసన మండలి సభ్యులకు గవర్నర్ లేఖ రాయడానికి అనుమతిస్తుంది. ‘‘శాసనసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లుకు సంబంధించి రాష్ట్ర శాసనసభ లేదా సభలకు గవర్నర్ సందేశాలు పంపవచ్చు. సందేశం పంపబడిన సభ ఏదైనా విషయాన్ని అన్ని అనుకూలమైన పంపకాలతో పరిగణించాలి. ఆ సందేశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని ఆ నిబంధన పేర్కొంటుంది. ఇక, గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. తెలంగాణ పంచాయితీ రాజ్ (సవరణ) బిల్లు 2023, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయీస్ (సవరణ) బిల్లు 2022, తెలంగాణ మున్సిపల్ (సవరణ) బిల్లు 2022 గురించి తన ఆందోళనలను ఈ సందేశంలో పేర్కొన్నారు.