తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరుకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడాన్ని బీఆర్‌ఎస్ నాయకులు దాసోజుశ్రవణ్, సత్యనారాయణ సవాల్ చేశారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 8వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలగా టీజేఎస్ అధ్యక్షుడు ఫ్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీ ఖాన్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా.. గవర్నర్ ఆమోదముద్ర వేశారు. 2023 జూలై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్‌కు సిఫారసు చేసింది.
అయితే ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరస్కరించారు. నిబంధనల మేరకు వీరిద్దరి పేర్లను ఆమోదించలేమని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. దీంతో జోక్యం చేసుకోవాలని దాసోడు, కుర్రా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపాదనలోని ఇద్దరు నేతలు పొలిటికల్ లీడర్స్ అని.. సర్వీస్ రంగంలోని వారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చాన్స్ ఉంటుందని, కానీ, ఆ ఇద్దరు లీడర్ల సర్వీస్ గురించి ప్రభుత్వం పేర్కొనలేదని, అందుకే తాను ఆమోదించలేదని గవర్నర్ వెల్లడించారు. వీరి ప్లేస్ లో వేరే వ్యక్తుల పేర్లు పంపాలని గవర్నర్ సూచించినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పంపించలేదు. కేబినెట్ ఆమోదంతో నామినేట్ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను ఈ నెల 23న సీజే బెంచ్ విచారించనుంది.