టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో.. చాలామంది శైవ పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు. దీంతో బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశమున్న దృష్ట్యా ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో స్పెషల్ బస్సులు నడిపే అవకాశం కూడా ఉంది. . ఈ కారణంగా డ్రైవర్లు, కండక్టర్లకు సెలవులను రద్దు చేసింది ఆర్టీసీ. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3తో పోలిస్తే నిన్న (ఆదివారం) దాదాపు 15 శాతం రద్దీ పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. కాగా ఇవాళ ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.