గుడ్ న్యూస్.. ఆగష్టు నుంచి పట్టాలెక్కనున్న 'గృహలక్ష్మి పథకం'

తొలి ప్రాధాన్యం వారికే

Update: 2023-07-14 04:45 GMT

సొంతస్థలం ఉండి.. ఇంటిని నిర్మించుకోవాలనే వారికి గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన గృహలక్ష్మి పథకం ఆగస్టు నుంచి పట్టాలెక్కనుంది. ఈ పథకం ద్వారా ఏటా 4 లక్షల మందిని ఎంపిక చేసి , 3 లక్షలు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రతి నియోజకవర్గం నుంచి 3000 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఎంపికైన లబ్ధిదారులకు 3 దశల్లో ఆయా మొత్తాలను విడుదల చేసేందుకు నిర్ణయించింది.

ఈ నెలాఖరులోగా ఇందుకు సంబంధించిన ప్రక్రియనంతా పూర్తి చేసి.. వచ్చే నెల నుంచి మూడు విడుతలుగా మూడు లక్షలు ఇవ్వనున్నారు. ఏ ప్రభుత్వ పథకంలోనూ లబ్ధి పొందని వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10, బీసీ మైనార్టీలకు 50 శాతం ఇవ్వాలని సర్కారు స్పష్టం చేసింది. మిగిలిన 20 శాతాన్ని ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇవ్వనుంది. కార్యాచరణ విధానాల రూపకల్పనలో మున్సిపల్, పంచాయతీరాజ్, రహదారులు-భవనాల శాఖ ఉన్నతాధికారులను భాగస్వాములను చేయనుంది.

ఆగస్టు చివరివారం నుంచి లబ్ధిదారుల దరఖాస్తులను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకల్లా క్షేత్రస్థాయిలో కార్యాచరణ విధానాలన్ని సెట్ అయ్యాక.. సీఎం కేసీఆర్‌కు ఉన్నతాధికారులు ఫైనల్ రిపోర్ట్ ను అందజేస్తారు. ఆయన సూచనల మేరకు మార్పులు చేశాక తుది ఉత్తర్వులు వెలువడతాయని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 వేల మంది లబ్ధిదారులకు ఆర్థికసాయం అందచేయనున్నందున.. మిగిలిన దరఖాస్తుదారులను ప్రాధాన్యక్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యం ఇవనున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తులు చేసుకునేందుకు తుది గడువును కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యాక ప్రకటించే అవకాశం ఉంది.

Tags:    

Similar News