పాతబస్తీలో కాల్పుల కలకలం..

Update: 2023-06-18 03:39 GMT

హైదరాబాద్‌ పాతబస్తీలోని మీర్చౌక్లో అర్ధరాత్రి కాల్పులు కలకలం రేగింది. ఓ ఇంటి కొనుగోలు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో మసూద్‌ అలీ అనే అడ్వొకేట్ గాలిలోకి కాల్పులు జరిపాడు. విషయం తెలిసి ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

అర్ఫాత్‌ అనే వ్యక్తి కొన్నిరోజుల క్రితం ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అయితే ఆ ఆస్తి వివాదంలో ఉండటంతో దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఇరువర్గాల మధ్య గొడవ నడుస్తోంది. ఆ ఇంటిపై కోర్టులో కేసు ఉండగా ఎలా కొంటారని పక్కింటి వారు గొడవకు దిగారు. ఇదే వ్యవహారంలో ఇరువర్గాలు పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ విషయంపై కోర్టుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే గత శనివారం అర్ఫాత్ మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసుపెట్టాడు.

కేసు విషయం తెలియడంతో శనివారం అర్ధరాత్రి మసూద్‌ అలీ అనే న్యాయవాది అర్ఫత్‌తో గొడవకు దిగాడు. అర్ఫత్ అతని కుటుంబసభ్యులను భయపెట్టేందుకు తన వద్ద ఉన్న గన్తో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఇరువర్గాల రాళ్లు, కర్రలతో పరస్పర దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News