Gutta Sukendhar Reddy : పార్టీ మార్పు వార్తలపై స్పందించిన గుత్తా సుఖేందర్ రెడ్డి

Byline :  Kiran
Update: 2024-01-23 12:47 GMT

బీఆర్ఎస్ హైకమాండ్పై తాను ఆగ్రహంతో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా దుష్ప్రచారమని అన్నారు. నల్గొండ లేదా భువనగిరి ఎంపీగా పోటీ చేసేందుకు తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి రెడీగా ఉన్నాడని చెప్పారు. హైకమాండ్ ఆదేశిస్తే పోటీకి సిద్ధమని, పార్టీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని గుత్తా స్పష్టం చేశారు. తన కుమారుడిది అందరినీ కలుపుకొని పోయేతత్వమన్న గుత్తా పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తేల్చిచెప్పారు.

కష్ట కాలంలో కూడా పార్టీ కోసం పనిచేసిన వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ హైకమాండ్ పై ఉందని గుత్తా అభిప్రాయపడ్డారు. తన కొడుకుకు టికెట్ ఇచ్చే అంశంపా రెండుమూడు రోజుల్లో క్లారిటీ వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. పార్టీ మారుతున్నానంటూ వస్తున్నవన్నీ పుకార్లేనని, అసలు తనకు ఆ అవసరమేలేదని స్పష్టం చేశారు.

నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కృష్ణా రివర్ బోర్డ్ పరిధిలోకి వెళ్తే రాష్ట్రానికి గొడ్డలి పెట్టులాంటిదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలించాయని చెప్పారు.




Tags:    

Similar News