15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు

Byline :  Shabarish
Update: 2024-03-07 09:40 GMT

తెలంగాణలో మార్చి 15వ తేది నుంచి ఒంటిపూట బడులు ఉంటాయని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 15 నుంచి ఏప్రిల్ 23వ తేది వరకూ ఒంటి పూట బడులను నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో మార్చి 15వ తేది నుంచి ఏప్రిల్ 23వ తేది వరకూ ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.

ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో మార్చి 15వ తేది నుంచి పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. అలాగే మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పాఠశాలలు ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం పెట్టిన తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపించనున్నారు.

ఇకపోతే 10వ తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ తరగతులను నిర్వహించనున్నారు. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే ఆయా పాఠశాలల్లో బడులు సాగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. ఏప్రిల్ 23వ తేది తర్వాత వేసవి సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి పాఠశాలలు జూన్ నెలలో ప్రారంభం కానున్నాయి.


Tags:    

Similar News