రాష్ట్రంలో వరుసగా మూడోసారి బీఆర్ఎస్ జెండా ఎగరేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న సీఎం కేసీఆర్కు ఎన్నికలకు ముందు కొత్త తలనొప్పి మొదలైంది. పార్టీకి చెందిన కొందరు నేతల వ్యవహారశైలి ఇబ్బందికరంగా మారింది. వారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తమ హయాంలో మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తామన్న ప్రభుత్వంలో భాగస్వాములైన వారే ఇప్పుడు ఆడవారిని వేధిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాలు బయటికొస్తే పార్టీ పరువు పోతుందని హైకమాండ్ వీటిపై సైలెంట్ గా ఉంటోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గాల్లో బలమైన నాయకులు కావడం, ప్రత్యామ్నాయం లేకపోవడంతోనే వారిపై చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ నేతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం వెనుక యాదృచ్చికమా? లేక రాజకీయ కుట్ర దాగి ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దుర్గం చిన్నయ్యపై శేజల్ పోరాటం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆరిజిన్ డైరీ సీఏఓ శేజల్ ఆరోపిస్తోంది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ గత కొన్ని రోజులుగా పోరాటం కొనసాగుతూనే ఉంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించిన శేజల్, నిరాహార దీక్ష కూడా చేపట్టింది. తాజాగా బుధవారం (జూన్ 21)న బీఆర్ఎస్ ఎంపీలను కలిసిన శేజల్.. తనకు న్యాయం చేయాలని కోరింది. దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తానని తెగేసి చెప్పింది.
రాజయ్యపై సర్పంచ్ ఆరోపణలు
ఇక స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య ఆరోపిస్తోంది. తాజాగా ఆమె రాజయ్యపై మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యే రాజయ్య, ఆయన అనుచరులు కొద్దిరోజుల క్రితం తనకు ఓ అగ్రిమెంట్ పంపారని రాజకీయ లబ్ధికోసమే.. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసినట్లు సంతకం పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించింది. ప్రజాప్రతినిధుల ద్వారా డబ్బు ఆశ చూపించి, తన భర్తను ట్రాప్ చేసిన రాజయ్య తనను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని నవ్య కన్నీటిపర్యంతమవుతోంది. గతంలో గ్రామాభివృద్ధికి ఇస్తామన్న రూ. 20 లక్షలు.. తామే తీసుకున్నామని బాండ్ పేపర్పై సంతకాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పింది. తన కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే వల్ల ప్రాణహాని ఉందంటున్న నవ్య.. త్వరలోనే అన్ని ఆధారాలు బయటపెడతానని చెప్పింది. మరోవైపు తాటికొండ రాజయ్యతో పాటు మరో ఐదుగురిపై నవ్య పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఇదిలా ఉంటే రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన మహిళలతో అసభ్యంగా వ్యవహరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మహిళా కార్పొరేటర్కు లైంగిక వేధింపులు
మరోవైపు రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి చెందిన ఓ మహిళా కార్పొరేటర్ కు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడారంటూ ఆరోపణలు వస్తున్నాయి. సదరు కార్పొరేటర్తో కలిసి గత కొంత కాలంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.. ఆమెతో చనువు పెంచుకున్నట్లు తెలుస్తోంది. దాన్ని అసరాగా చేసుకుని ఆయన అర్ధరాత్రి సమయంలో కార్పొరేటర్ కు ఫోన్ చేసి.. అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే మాటల్ని రికార్డు చేసిన బాధితురాలు ఆ ఆడియో క్లిప్ను పార్టీ హైకమాండ్ కు పంపినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని బయట ఎవరి వద్ద ప్రస్తావించవద్దని పార్టీ పెద్దలు సదరు మహిళా కార్పొరేటర్కు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.
హైకమాండ్ మౌనం
ఇదిలా ఉంటే దుర్గం చిన్నయ్య, తాటికొండ రాజయ్యతో పాటు హైదరాబాద్కు చెందిన మరో ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు అధిష్టానం దృష్టికి వచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల్లో ఇద్దరు తమ నియోజకవర్గాల్లో బలమైన నాయకులు కావడంతో పాటు వారికి ప్రత్యామ్నాయం ఎవరూ లేరు. దీంతో ఆ ఇద్దరిపై చర్యలు తీసుకునేందుకు పార్టీ పెద్దలు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నా ఆ నేతలకు ప్రత్యామ్నాయం లేనందున ఈసారి కూడా ఆ ఇద్దరికి టికెట్ ఇవ్వడం పక్కా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య విషయంలో మాత్రం బీఆర్ఎస్ హైకమాండ్ చర్యలు తీసుకునే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. పదేపదే మహిళల్ని వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈసారి రాజయ్యను పక్కనబెట్టి కడియం శ్రీహరికి ఆ టికెట్ ఇచ్చే ఛాన్సుందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు లైంగిక వేధింపుల సాకు చూపి ఈసారి ఆయా నేతలకు టికెట్లు నిరాకరించేందుకే ఈ ఆరోపణలను హైలైట్ చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.